ఇక ప్రగతి పరుగులు
● రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేయనున్న సీఎం
● పటిష్ట బందోబస్తు, ఉమ్మడి జిల్లా నుంచి భారీగా నేతలు రాక
సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెట్టనుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పట్టణంలో నిర్వహించనున్న సీఎం భారీ బహిరంగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రూ.228 కోట్లతో రోడ్ల అభివృద్ధి, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.150 కోట్లతో వైద్య కళాశాల, రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, సెంట్రల్ లైటింగ్‌తోపాటు మరో రూ.400 కోట్ల అభివృద్ధి పనులున్నాయి. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
పనుల వివరాలు..
● రూ.83 కోట్లతో వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారి నాలుగు లేన్లుగా విస్తరణ.
(ధర్మారం, గీసుకొండ, ఊకల్ క్రాస్‌రోడ్డు, మచ్చాపూర్, కొమ్మాల, గిర్నిబావి, లక్నెపల్లి, మహేశ్వరం నుంచి నర్సంపేట వరకు)
● రూ.17.28 కోట్లతో నర్సంపేట నుంచి పాకాల వరకు 10 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణం (నర్సంపేట, అయోధ్యనగర్, అశోక్‌నగర్, పాకాల వరకు)
● రూ.38.74 కోట్లతో నెక్కొండ నుంచి కేసముద్రం వరకు 12.10 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మా ణం. (నెక్కొండ, అప్పల్‌రావుపేట, వెంకటాపు రం, తోపనపల్లి, అలంకానిపేట, కేసముద్రం)
● రూ:56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ వరకు 18.47 కిలోమీటర్లు డబుల్ రోడ్డు నిర్మాణం. (నర్సంపేట, పాత ముగ్దుంపురం, చెన్నారావుపేట, జల్లి, అమీనాబాద్, పనికర, అమీన్‌పేట, నెక్కొండ వరకు)
● రూ.33 కోట్లతో నెక్కొండ నుంచి గూడురు వరకు పది కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణం. (నెక్కొండ, సూరిపల్లి, లింగగిరి, గూడూరు వరకు)
సీఎం సభకు ఏర్పాట్లు..
అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నర్సంపేటకు రానున్నారు. పట్టణంలోని సర్వాపురం శివారులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట సభా స్థలిని ఏర్పాటుచేశారు. సభా స్థలికి వెళ్లేందుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. స్టేజీపై సుమారు 50 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నర్సంపేట డివిజన్‌లోని ఆరు మండలాలల నుంచి 50 వేల మందిని సభకు తరలించనున్నారు. ఇందుకోసం 135 ఆర్టీసీ బస్సులు, 60 ప్రైవేట్ బస్సులను సిద్ధం చేశారు. ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. ముఖ్యమంత్రి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నర్సంపేట నుంచి పాకాల, కొత్తగూడకు వెళ్లే ప్రజలు నర్సంపేట, ఖానాపురం, మనుబోతులగడ్డమీదుగా పాకాల, కొత్తగూడకు వెళ్లాలని నర్సంపేట టౌన్ సీఐ రఘపతిరెడ్డి సూచించారు. చెన్నారావుపేట, నెక్కొండ నుంచి సభకు వచ్చే ప్రజలు నెక్కొండ సెంటర్ నుంచి ద్వారాకపేట రోడ్డు, మహబూబాబాద్ రోడ్డు, పాకాల సెంటర్ మీదుగా సభకు చేరుకోవాలని పేర్కొన్నారు. వరంగల్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు అంబేడ్కర్ సెంటర్, పాకాల సెంటర్ మీదుగా సభా స్థలానికి చేరుకోవాలని ఆయన కోరారు.


