వరాలు కురిపిస్తారా..!? | - | Sakshi
Sakshi News home page

వరాలు కురిపిస్తారా..!?

Dec 5 2025 6:58 AM | Updated on Dec 5 2025 6:58 AM

వరాలు కురిపిస్తారా..!?

వరాలు కురిపిస్తారా..!?

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు నర్సంపేటలో ఏర్పాటుచేసిన హెలిపాడ్‌లో దిగుతారు. 2.15నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్తారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మొంథా’ తుపానుతో ఇళ్లు కూలిపోయిన వారికి రూ.15 వేల చొప్పున చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపినా చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

డీపీఆర్‌ స్థాయిలోనే ‘గ్రేటర్‌’ పనులు..

ముఖ్యమంత్రి పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా వరంగల్‌కు పలు హామీలు ఇచ్చారు. హైదరాబాద్‌తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాడ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్‌ నగరంలో సుమారు రూ.నాలుగు వేల కోట్ల విలువైన అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్‌ల దశలో ఉన్నాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు పలు అభివద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్‌సిటీ పనులకు తోడు రాష్ట్ర వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్‌ వరంగల్‌కు రావాల్సి ఉంది. అలాగే, మేడారం అభివృద్ధి, గిరిజన వర్సిటీకి మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

ఆ మూడు పథకాలపై స్పష్టత..

కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఇటీవల వరంగల్‌లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ), కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు, మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు పనులను కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అందజేస్తే విమానాశ్రయం పనులు త్వరగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్‌ మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ త్వరగా నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం.

నేడు నర్సంపేటకు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గత పర్యటనలో రూ.6,500 కోట్లు

మంజూరు చేసిన సీఎం..

మందకొడిగా పనులు

ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ,

ఆర్‌ఎంయూపై వ్యాఖ్యలు

ఈ మూడు ప్రాజెక్టుల్లో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం

ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement