నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
నామినేషన్ల స్వీకరణ పరిశీలన
ఎల్కతుర్తి: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం ఎల్కతుర్తి మండలం క్లస్టర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలు దామెర, ఎల్కతుర్తి, గోపాల్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన వార్డు, సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఎలక్షన్ నోటీస్, ఓటర్ల జాబితా, హెల్ప్ డెస్క్‌ల ఏర్పాట్లు పరిశీలించి అధికాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 210 గ్రామ పంచాయితీలు, 1986 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఎన్నికలు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో 24 క్లస్టర్లలో ఉన్నాయని చెప్పారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు అదనంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీఎం, సెంటర్ ఇన్‌చార్జ్‌కు
షోకాజ్ నోటీసులివ్వండి..
శాయంపేట: మండలంలోని పత్తిపాకలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్యాబ్‌లో రైతుల వివరాలు నమోదు చేస్తున్నారా? అని సెంటర్ బుక్ కీపర్‌ను అడగ్గా సిగ్నల్ ప్రాబ్లం కారణంగా 6 రోజుల నుంచి నమోదు చేయడం లేదని నిర్వాహకులు తెలపడంతో సిమ్ ప్రాబ్లం సరి చూసుకోవాలని, 6 రోజుల నుంచి ఎందుకు ట్యాబ్ బాగు చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఇన్‌చార్జ్‌కు, ఏపీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 32 లారీల ధాన్యం పంపించినా కూడా రైతులకు డబ్బులు పడడక పోవడం ఎంటని నిర్వాహకులను ప్రశ్నించారు. కేంద్రాల్లో చాలా సమస్యలున్నాయని, అధికారులు పట్టించుకోవట్లేదని ఎంపీడీఓ ఫణిచంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర, ఏపీఎం వేణుగోపాల్‌రావు, అధికారులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
హన్మకొండ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో సాంకేతిక, సమాచార ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


