ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకుందాం
వరంగల్ క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో గురువారం కమిషనరేట్‌లో నేర సమీక్ష నిర్వహించారు. మూడు విడతలుగా నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్‌స్టేషన్ వారీగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాల వివరాల్ని పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతీ పోలీస్ అధికారి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నామినేషన్ మొదలుకుని ఎన్నికలు ముగిసే వరకు పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, నేరాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్ష జరిపారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ఏఎస్పీలు శుభం, చైతన్య, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎన్నికల బందోబస్తు చేపట్టండి
ఎల్కతుర్తి: పకడ్బందీగా ఎన్నికల బందోబస్తు చేపట్టాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కావడంతో ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ క్లస్టర్‌ను సీపీ సందర్శించారు. శాంతి భద్రతల ఏర్పాట్లపై అధికారులు చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నియమాలను కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునే వాతావరణం కల్పించాలన్నారు. ఎలాంటి వివాదాలు, అశాంతికి తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సమస్యత్మాక కేంద్రాల వద్ద అవసరమైతే అదనపు బలగాలు వినియోగించాలన్నారు. అఽధికారులంతా పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తేనే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట డీసీపీ కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్
సన్ ప్రీత్ సింగ్
కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష


