సర్వేలన్నీ మనవైపే ఉన్నాయి
మాజీ ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఐనవోలు: సర్వేలన్నీ బీఆర్‌ఎస్ పార్టీవైపే ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. బీసీలను కాంగ్రెస్ పార్టీనే మోసం చేసిందన్నారు. కేసీఆర్ హయాంలో అందరికి చీరలు ఇస్తే ఇప్పుడు రేవంత్‌రెడ్డి మహిళా సంఘాల్లో ఉన్న వారికే ఇస్తున్నాడన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలతో ప్రజలు మోసపోయారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇస్తుందని, ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రజలు రేవంత్‌రెడ్డి పాలనలో అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో తంపుల మోహన్, మెట్టు శ్రీను, తక్కళ్లపల్లి చందర్‌రావు, గుజ్జ గోపాల్‌రావు, పోలెపల్లి రామ్మూర్తి, పల్లకొండ సురేష్, ఉస్మాన్ అలీ, కంజర్ల రమేశ్, జైపాల్‌రెడ్డి, తాటికాయల కుమార్ పాల్గొన్నారు.


