సహాయం అందేలా చర్యలు
ఖిలా వరంగల్: వరద బాధితులకు ప్రభుత్వం సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని ముంపునకు గురైన కాలనీలను తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్‌తో కలిసి కలెక్టర్ సత్యశారద క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముంపునకు గురైన కాలనీలను, శివనగర్‌లోని 80 ఫీట్ల రోడ్డులో దెబ్బతిన్న నాలా కల్వర్టును పరిశీలించారు. ముంపు నిర్వాసితులను కలిసి మాట్లాడారు. నీట మునిగిన గృహాలు, ఆస్తినష్టం వివరాల్ని ఎన్యుమరేటర్లు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. పరిహారం ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతీ కుటుంబానికి సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రహదారులు, కాలువలు, డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి, తక్షణ మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద


