మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
న్యూశాయంపేట: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదుకోవాలని, మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మోంథా తుపాన్ సహాయక చర్యలపై గురువారం జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద తదితర అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తుపాన్ నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. తుపాన్ ప్రభావిత, ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేయాలన్నారు. 24గంటలు అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. శుక్రవారం(నేడు) వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తామన్నారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణాల రక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్, జిల్లా అధికారులు ప్రజల వెంటే ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను తరలించడానికి మరిన్ని పడవలు కావాలని కోరారు. వీసీ అనంతరం కలెక్టర్ సత్యశారద.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. లోతట్లు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్డీఆర్‌ఎఫ్‌టీ, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నేడు వరంగల్, హుస్నాబాద్
ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
పాల్గొన్న మంత్రి సురేఖ,
కలెక్టర్ సత్యశారద


