తుపాను ప్రభావంతో 25 గొర్రెల మృత్యువాత
నర్సంపేట రూరల్ : చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన గొర్రెలు మేత కోసం బుధవారం ఉదయం అడవికి వెళ్లాయి. మోంథా తుపాన్ ప్రభావంతో అడవిలోనే 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ డిమాండ్ చేశారు.
జువైనల్ హోంకు
బాలుడి తరలింపు
ఖానాపురం: మండలంలోని ఓ తండాకు చెందిన నాలుగు సంవత్సరాల బాలికపై ఇదే తండాకు చెందిన బాలుడు లైంగిక దాడికి పాల్పడిన విషయం విధితమే. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా బాలుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌లో నగరంలోని జువైనల్ హోంకు గురువారం తరలించినట్లు తెలిసింది. ఇందిలా ఉండగా.. మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన అంగన్‌వాడీ సెంటర్ టీచర్ మూడు పద్మను విధుల నుంచి తొలగించినట్లు డీడబ్ల్యూఓ రాజమణి గురువారం తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్ విధుల్లో నిర్లక్ష్యం వహించడం, అధికారులకు విషయం తెలపకుండా సెంటర్‌ను మరొకచోటుకు మార్చడంతోపాటు పలు సంఘటనలకు కారణం కావడంతో కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా అంగన్‌వాడీ టీచర్‌ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు డీడబ్ల్యూఓ తెలిపారు.
డీఈని నిలదీసిన రైతులు
వర్ధన్నపేట : వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు నిర్వహణ లోపం ఉందని, కేవలం వర్షం పడి చెరువు నిండినప్పుడే అధికారులు రావడం ఏమిటని నీటి పారుదల శాఖ డీఈ రాజును కోనారెడ్డి చెరువు వద్ద రైతులు గురువారం నిలదీశారు. కట్టకు రివిట్‌మెంట్ లేకపోవడంతో చెరువు నిండిన సమయంలో కోతకు గురయ్యే ప్రమాద ఉందని, కట్ట వెంట ఉన్న జంగిల్ కటింగ్ కూడా చేయకపోవడంతో కట్ట బలహీన పడే అవకాశం ఉందని రైతులు తెలిపారు. మత్తడి వద్ద పేరుకుపోయిన మట్టిని తొలగించకపోవడంతోపాటు మత్తడి రాళ్లను సరిచేయకపోవడంపై ప్రశ్నించారు. చెరువు నిండినప్పుడు మాత్రమే అధికా రులు హడావుడి చేస్తూ సందర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
ఎస్‌ఏ–1 పరీక్షల వాయిదా
కాళోజీ సెంటర్ : తీవ్ర వర్ష ప్రభావం కారణంగా విద్యార్థులు పాఠశాలకు చేరుకునే అనుకూల పరిస్థితులు లేనందున నేడు(శుక్రవారం) 31వ తేదీ, నవంబర్ 1 శనివారం నిర్వహించాల్సిన ఎస్‌ఏ–1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డీఈఓ రంగయ్య నాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొట్టుకుపోయిన కల్వర్టు.. పరిశీలించిన మంత్రి పొన్నం
ఎల్కతుర్తి: మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారి వర్షానికి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెగిపోయిన ప్రదేశం వైపు వాహనాదారులు వెళ్లకుండా రోడ్డు పూర్తిగా క్లోజ్ చేయాలని పోలీసులకు సూచించారు. దెబ్బతిన్న కల్వర్టు ప్రాంతంలో హైలెవల్ బ్రిర్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదవశాత్తు కల్వర్టులో పడి మృతి చెందిన కొత్తపల్లి గ్రామానికి చేందిన నాగేంద్రం కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వాగులో పడి గల్లంతైన ఇద్దరు బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలు శాఖల ఉన్నతాధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
తుపాను ప్రభావంతో 25 గొర్రెల మృత్యువాత


