 
															కొట్టుకుపోయిన కల్వర్టు.. పరిశీలించిన మంత్రి
ఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారి వర్షానికి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెగిపోయిన ప్రదేశం వైపు వాహనాదారులు వెళ్లకుండా రోడ్డు పూర్తిగా క్లోజ్ చేయాలని పోలీసులకు సూచించారు. దెబ్బతిన్న కల్వర్టు ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జ్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదవశాత్తు కల్వ ర్టులో పడి మృతి చెందిన కొత్తపల్లి గ్రామానికి చేందిన నాగేంద్రం కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వాగులో పడి గల్లంతైన ఇద్దరు బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలు శాఖల ఉన్నతాధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
వాహనదారులు వెళ్లకుండా రోడ్డును బ్లాక్ చేయండి
హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం..
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
