 
															జలంలోనే ‘నగర’జనం
హన్మకొండ/వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్/రామన్నపేట: వర్షం వీడినా నగరవాసులు ఇంకా జలంలోనే జనం ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాకా వర్షం తగ్గుముఖం పట్టింది. అయినా.. లోతట్టు కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. వరంగల్ పరిధిలోని శివనగర్, ఎన్‌ఎన్‌నగర్, డీకేనగర్, కాశికుంట, సాకరాశికుంట, వాంబేకాలనీల్లో వరదనీరు ఉధృతి ఇంకా వీడలేదు. దీంతో 34,35,40,41,42,32,33 డివిజన్లలోని పలు కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ధాటికి ఇంటిముందు, ఇంట్లో పార్క్ చేసిన బైక్‌లు, కార్లు నీటిలో తెలియాడాయి గురువారం ఉదయం వర్షం వీడిన తర్వాత మరమ్మతుల కోసం మెకానిక్‌ల వద్ద క్యూ కడుతూ కనిపించారు.
తాగునీటికి ఇక్కట్లు
ముంపు కాలనీల్లోని భవనాలపై తలదాచుకున్న వారికి తాగునీరు, ఇతర అవసరాల ఇక్కట్లు తప్పలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం మధ్యాహ్నం బల్దియా అధికారులు ట్రాక్టర్ల లో శుద్ధనీటిని తెచ్చి ఇంటికో క్యాన్ అందించారు. శివనగర్ జలదిగ్బందంలో చిక్కింది. రహదారులపై 5 ఫీట్ల ఎత్తుతో వరదనీరు ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ బ్రిడ్జి క్రింది నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖిలా వరంగల్ కోట ఉత్తరద్వారం నీటిలో మునిగింది. మధ్యకోటలోని పంటపొలాలు, ఆకుకూరతోటలు నీట మునిగాయి. గురువారం ఉదయం మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఎన్‌ఎన్‌నగర్, రామన్నపేట ప్రాంతాలను సందర్శించారు. నీటిలో చిక్కన ప్రజలను సురక్షితంగా పునరవాస కేంద్రాలకు తరలింపు చర్యలు తీసుకున్నారు.
నీటమునిగిన రామన్నపేట
సంతోషిమాత కాలనీతో పాటు హంటర్, పోతన రోడు మీదుగా నీరంతా 29వ డివిజన్ రామన్నపేటకు చేరుకుంది. ఇళ్లలోకి మోకాళ్ల లోతు రావడంతో ఆయా కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. రాత్రింతా విద్యుత్ సౌకర్యం సైతం నిలిచిపోవడం భవనాలపైకి నిద్రపోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ హంటర్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు బొందిగవాగు దాటి పోతన రోడ్డు మీదుగా ఎంజీఎం వైపు హంటర్ రోడ్డుమీదుగా రైల్వేస్టేషన్, శివనగర్‌వైపు ప్రయాణాలు సాగుతుంటాయి. బొందిగ వాగు నుంచి 12 మోరీల జంక్షన్ వరకు సుమారు ఏడు ఫీట్ల లోతుతో అత్యంత వేగంగా వరద ప్రవాహం కొనసాగిన నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఈ ప్రాంతంగా గుండా రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి.
నిలువునా ముంచిన బొందివాగు
నగరంలో కీలకమైన బొందివాగు నాలా సమీప కాలనీల ప్రజల పెను శాపంగా మారింది. బుధవారం అర్ధరాత్రి దాటినే తర్వాత బొంది వాగు పొంగి పొర్లడంతో హంటర్ రోడ్డంతా జలసంద్రమైంది. ఎన్‌టీఆర్ నగర్, సాయినగర్, బృందావన కాలనీ, భద్రకాళీ నగర్, సంతోషిమాత కాలనీతోపాటు పోతన నగర్ రోడ్డుకు సమీపంలోని పలు కాలనీలు నీట మునిగాయి. క్షణ క్షణం పెరుగుతున్న వరద తో పేద,మధ్య, సంపన్నులు తేడా లేకుండా దాబాలపై, పై అంతుల్లో రాత్రంతా గడిపారు. తెల్లవారు జామున స్థానిక కార్పొరేటర్ గందె కల్ప న నవీన్, బల్దియా, పోలీస్ యంత్రాంగం వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలను బోట్ల ద్వారా వెళ్లి అందజేశారు.
హనుమకొండ పరిధిలో..
భారీ వర్షానికి రాంపూర్, సోమిడి చెరువులు నిండి మత్తడి పోయడంతో ఆ వరద వడ్డేపల్లికి చెరువులోకి చేరింది, వడ్డేపల్లి చెరువు మత్తడి పోస్తూ చెరువుకు సమాంతరంగా మత్తడి నీరు బయటకు వెళ్తుండడంతో ఆ వరద నీరు గోపాల్‌పూర్ చెరువులోకి చేరింది. గోపాల్‌పూర్ చెరువులోకి భారీ వరద చేరడంతో చెరువు కట్టపై నుంచి, 100 ఫీట్ల రోడ్డుపై నీరు పొర్లడంతో కాలనీలోకి వరద వచ్చి చేరింది. వరద నీరు సులువుగా వెళ్లేందుకు నిర్మించిన డక్ట్ అండ్ డ్రైన్‌కు ఏర్పాటు చేసిన జాలీకి చెత్తాచెదారం అడ్డుపడడంతో వరద నీరు నాలా ద్వారా ప్రవహిస్తూ పొంగిపొర్లడంతో గురువారం వేకువజామున 4 గంటలకు 100 ఫీట్ల రోడ్డుపై నుంచి గోపార్‌పూర్ చెరువు కింద ఉన్న వివేక్‌నగర్ కాలనీలోకి చేరింది. ఉదయం 4 గంటల తర్వాత గంటగంటకు వరద నీరు పోటెత్తడంతో పాటు నాలా ఉప్పొంగడంతో అమరావతినగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, విద్యానగర్, సమ్మయ్యనగర్, ఇంజనీర్స్ కాలనీ, గోపాల్‌పూర్ ప్రాంతంలోని కాలనీలు, రాజాజీ నగర్, నందితారే నగర్, రాంనగర్‌లోని వరద నీరు చేరి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
హనుమకొండ, వరంగల్ పరిధిలో తగ్గని వరద
నీళ్లల్లోనే పలు కాలనీలు
బాధితులకు తాగునీటికి ఇక్కట్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
