 
															వర్ష బీభత్సం
కమలాపూర్: మోంథా తుపాను రైతులను ఆగం చేసింది. కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి బ్రిడ్జితో పాటు వంగపల్లి, దేశరాజుపల్లి, కన్నూరు బ్రిడ్జీ ల వద్ద బ్రిడ్జిలను తాకుతూ ప్రవహించిన వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. పెద్ద చెరువు మత్తడి ప్రవాహ ఉధృతిలో ఒక కారు చిక్కుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాపాయం తప్పింది. శంభునిపల్లి వాగు ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలోని ప్రాథమిక పాఠశాలను వరద నీరు ముంచెత్తింది. పలు ఇళ్లల్లోకి వరద చేరింది. వంగపల్లిలో మంద రాజు అనే కౌలు రైతుకు చెందిన సుమారు రూ.1.50 లక్షల విలువైన రెండు పాడి ఆవులు వరదలో మునిగి మృతి చెందాయి. మండలవ్యాప్తంగా 2 వేలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మండల వ్యాప్తంగా 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
