 
															నష్టం కొండంత
ఎల్కతుర్తి మండలంలో..
మోంథా.. 
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్‌లో నీట మునిగిన వరిని చూపుతున్న రైతు
● నేలవాలిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు
● పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
● పలు గ్రామాలకు రాకపోకలకు
అంతరాయం
● నిలిచిన విద్యుత్ సరఫరా
● మూగజీవాల మృత్యువాత
మొంథా తుపాను ప్రభావంతో హనుమకొండ జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కుండపోత భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు, రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో చేతికి అందివచ్చిన వరి నేలవాలి తీవ్రనష్టం వాటిల్లింది. పత్తిలో నీరు నిలిచింది. వాగులు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడి దుంకాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని, గూడు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు, పలు పార్టీల నాయకులు కోరారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎల్కతుర్తి: మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఉట్కూరి ప్రభాకర్‌గౌడ్‌కు చెందిన కోళ్లఫామ్‌లోని 7 వేల కోడిపిల్లలు తుపాను తాకిడికి మృత్యువాత పడ్డాయి.
చింతపల్లి, గోపాల్‌పూర్ గ్రామాల్లో ఇళ్ల గోడలు కూలి నిలువ నీడ లేకుండా పోయింది.
గోపాల్‌పూర్‌లో ఓ లేగదూడ మృత్యువాత పడింది. మరో మూడు పశువులు వాగులో పడి కొట్టుకుపోయాయి.
ఎల్కతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కాలనీలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
ఎల్కతుర్తి నుంచి ముల్కనూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై వరదనీరు భారీగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో చేతికి అందివచ్చిన వరి నేలవాలింది.
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే రహదారి బ్రిడ్జి వరద నీటికి ధ్వంసమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
							నష్టం కొండంత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
