పిడుగుపాటుతో విద్యుత్ శాఖకు భారీ నష్టం
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
నెక్కొండ: మోంథా తుపాన్ కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని 133/33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లను ఆయన గురువారం రాత్రి సందర్శించి, మాట్లాడారు. బుధవారం మండలంలోని పత్తిపాక 33/11 కేవీ విద్యుత్ సబ్ సేష్టన్ సమీపంలోని గుట్టపై రెండు పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాకు అనుసంధానంగా ఉన్న ఆరు బ్రేకర్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. దీంతో పత్తిపాక, రెడ్లవాడ, నాగారం, లింగగిరి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లలో సరఫరా లినిచిపోయిందన్నారు. దెబ్బతిన్న బేకర్ల విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందిలేకుండా తాత్కాలిక ఏర్పాట్లుతో సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. వారంలో కొత్త బ్రేకర్లు అమర్చాలని చెప్పారు.
విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మోంథా తుపాన్, భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్ అన్నారు. బుధవారం కురిసిన వర్షం కారణంగా విద్యుత్ శాఖకు కలిగిన అంతరాయాన్ని గురువారం ఆయన పర్యవేక్షించారు. సకాలంలో మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్, నర్సంపేట డీఈ తిరుపతి, ఏడీఈ శ్రీధర్, ఏఈ చిరంజీవి ఉన్నారు.


