అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
● రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్: అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వరద బాధితుల భరోసా ఇచ్చారు. మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జలమయమైన ఎన్‌ఎన్‌నగర్, డీకే నగర్, బీఆర్‌నగర్ ప్రాంతాల్లో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి సురేఖ సందర్శించి వరద బాధితులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్‌ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ముంపు పరిస్థితి తలెత్తుతుందని, నగర పరిధిలో లోతుట్టు ప్రాంతాలు ఉండటం, కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురికావడం, సరైన ెనాలాలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు పునరావృత్తమవుతున్నాయని అన్నారు. ఇలాంటి ఇబ్బందులు మళ్లీ రాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో సగటున 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పర్వతగిరి, కల్లెడ ప్రాంతాల్లో 37 సెం.మీ, నెక్కొండలో 33 సెం.మీ వర్షం కురిసిందని, పర్వతగిరిలో కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ పర్యవేక్షించినట్లు తెలిపారు. రాయపర్తి మండలంలో ఓ చెరువు కట్ట తెగిపోయి 50 ఇల్లు దెబ్బతిన్నాయని, పంట పొలాల్లోకి నీరు చేరిందని తెలిపారు. నగరంలోని కొన్ని కాలనీలు నీటిలో ఉన్నాయని, ముంపును అరికట్టకలిగితే రాబోయే 12 నుంచి 16 గంటల్లో నీరు పూర్తిగా వెళ్లిపోయే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ ఇక్బాల్, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్లి రవి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు పాల్గొన్నారు.
అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది


