
బీజేపీకి సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్
● ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ దొంగ ఓట్లను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ అధికారం కోసం బీజేపీ చేస్తున్న కుట్రను బహిర్గతం చేయడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు పౌరుడి హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. అబ్బిడి రాజిరెడ్డి, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, ఎద్దు సత్యనారాయణ, పోశాల వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.