
‘కలెక్టరేట్‌లో కామాంధుడు’పై వేటు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లోని ఓ సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కామాంధుడిపై కలెక్టర్ స్నేహ శబరీష్ కొరఢా ఝుళిపించారు. సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని తీరుపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం వెలువడింది. దీంతోపాటు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ప్రాథమిక చర్యల్లో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్.. అతనిని గత నెల 19న కలెక్టరేట్‌నుంచి ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. ఆ వెంటనే సమగ్ర విచారణకు ఐసీసీ కమిటీని ఏర్పాటుచేశారు. తొమ్మిది మందితో ఏర్పాటైన ఐసీసీ కమిటీ.. బాధితురాలు, నిందితుడు, సాక్షులను విచారించింది. సాంకేతిక ఆధారాలు పరిశీలించింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నివేదిక ఇచ్చి నట్లు సమాచారం. వీటన్నింటిని పరిశీలించిన కలెక్టర్ న్యాయ సలహా కూడా తీసుకుని ఆ కామాంధుడిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, ఇప్పటికే సదరు సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేసుకున్న చాంబర్‌ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే.
తదుపరి చర్యలకు సిఫారసు..
కలెక్టర్.. సదరు సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్‌ను సస్పెండ్ చేయడంతోపాటు తదుపరి కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. తన కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. భవిష్యత్‌లో మహిళా ఉద్యోగుల పట్ల అలాంటి ఆలోచన వస్తే ప్రస్తుత చర్యలు గుర్తుకు రావాలన్నట్లు కలెక్టర్ స్పందించి చర్యలకు ఉపక్రమించారు.
కుల సంఘాల ఫిర్యాదు..
బాధితురాలి పక్షాన ఎస్సీ సంఘాలు, ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఇప్పటికే విన్నవించారు. ఈ ఫిర్యాదుపై కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అంతవరకు వేచిఉండాలని కలెక్టర్ వారికి సూచించారు. పలువురు మహిళా సిబ్బందిని వేధించిన సదరు ఉద్యోగి విషయంలో కలెక్టర్ తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
‘సాక్షి’కి అభినందనలు..
ఈ ఘటన విషయంలో మొదటి నుంచి వాస్తవాలు వెలికి తెస్తూ, కథనాలు రాసిన ‘సాక్షి’కి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి.
సస్పెండ్ చేసిన హనుమకొండ కలెక్టర్
తదుపరి చర్యలకు సిఫారసు

‘కలెక్టరేట్‌లో కామాంధుడు’పై వేటు

‘కలెక్టరేట్‌లో కామాంధుడు’పై వేటు