రామన్నపేట: బీఫార్మసీ, ఫార్మ్‌డీ, ఫార్మాస్యూ టికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్‌సెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు టీజీ ఎప్‌సెట్ అడ్మిషన్స్ హెల్ప్‌లైన్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, నిర్దిష్ట సమయానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. తొలిరోజు (మంగళవారం) 313 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకున్నారని, ఈనెల 9వ తేదీ వరకు సర్టిఫికెట్లషన్ ఉంటుందని వివరించారు. అనంతరం ఆప్షన్ ఫ్రీజింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు http:// tgeapcetb.nic.in వెబ్‌సైట్ సందర్శించాలని ఆయన కోరారు.
కార్మిక చట్టాల రక్షణకు ఉద్యమించాలి
న్యూశాయంపేట: కార్మిక చట్టాల రక్షణ కోసం నిరంతరం ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ పిలుపునిచ్చారు. హనుమకొండలో మంగళవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం రెండో మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా టి.సారంగపాణి, ప్రధాన కార్యదర్శిగా టి.ఉప్పలయ్య, కోశాధికారిగా ఎ.యాకయ్యతోపాటు పి.రవి, పి.అశోక్, సాంబయ్య, వెంకటస్వామి, భిక్షపతి, రవీంద్రాచారి, సుదర్శన్, రవీందర్, రాజు, స్వప్నను ఎన్నుకున్నారు.
సీజేఐపై దాడికి యత్నం.. న్యాయ దేవతపై దాడే
వరంగల్ లీగల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించడం.. న్యాయ దేవతపై జరిగిన దాడిగానే పరిగణించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ అన్నారు. సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ రెండు బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట భారీ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, అదేపరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాఽధికారి అరుణ, ఈసీ సభ్యులు సురేశ్, మేఘనాథ్, మహేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షురూ