అందరి దృష్టి హైకోర్టు తీర్పు పైనే.. | - | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి హైకోర్టు తీర్పు పైనే..

Oct 8 2025 6:03 AM | Updated on Oct 8 2025 2:37 PM

వరంగల

అందరి దృష్టి హైకోర్టు తీర్పు పైనే..

‘స్థానిక’ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నేడే జడ్జిమెంట్‌

వేచి చూసే ధోరణిలో ప్రధాన పార్టీల నేతలు, ఆశావహులు

అనుకూలమా? ప్రతికూలమా? తేలాకే ఎన్నికల బరిలోకి

రేపటి నుంచే మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: షెడ్యూల్‌ వచ్చే దాకా ఒక టెన్షన్‌.. తేదీలు ప్రకటించాక రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై మరో టెన్షన్‌. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తేలే సమయం రానే వచ్చింది. బుధవారం వెలువడే హైకోర్టు తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. అన్ని వర్గాల్లోనూ అనుకూలమా? ప్రతికూలమా? అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల జీఓను సవాల్‌ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది.

తీర్పు వెలువడిన తర్వాతే ముందుకు..

2024 ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు, జూలైలో మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటన్నింటితోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్‌ ద్వారా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో కుల గణన చేపట్టింది. అలాగే, బీసీ డెడికేషన్‌ కమిటీ వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసింది. 

ఆ తర్వాత స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులు రూపొందించి సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఆ ప్రక్రియలు పూర్తయ్యాక సెప్టెంబర్‌ నెలాఖరులో జీఓ 9 తీసుకొచ్చి వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి, ఏకకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో వేచిచూసే ధోరణికి వచ్చిన ప్రధాన పార్టీల నేతలు.. నేడు వెలువడే తీర్పు తర్వాత పరిస్థితులను బట్టి మరింత ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

తీర్పుకు ముందే ఊహాగానాలు..

బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జెడ్పీలు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలకు రిజర్వేషన్ల గెజిట్‌ ఇప్పటికే విడుదలైంది. 778 ఎంపీటీసీ, 1,708 సర్పంచ్‌ స్థానాలు, 15 వేల పైచిలుకు వార్డులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ సమయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో జోరందుకుంటున్న ఊహాగానాలు పల్లెల్లో గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాయి. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగనున్నాయని, ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఇప్పుడు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు స్థానాలు తగ్గి జనరల్‌కు పెరుగనున్నాయని.. ఇలా రకరకాలు జరుగుతున్న ప్రచారానికి తోడు రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలతో పరిస్థితులు హాట్‌హాట్‌గా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement