
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ విశ్వప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కందిక చెన్న కేశవులు, కళ్యాణి, రాకేష్, వెంకన్న, రాజు, భద్రు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.