
సీజేఐపై దాడి న్యాయ దేవతపై దాడే
వరంగల్ లీగల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది యత్నించిన దాడి న్యాయ దేవతపై జరిగిన దాడిగానే పరిగణించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ అన్నారు. ఇటీవల సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రెండు బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. దేశ ప్రజలు న్యాయవ్యవస్థను గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, అదేపరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాఽధికారి అరుణ, ఈసీ సభ్యులు సురేశ్, మేఘనాథ్, మహేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.