
ఎర్రబారిన వరిపొలం
● కలుపు నివారణకు మందు పిచికారీతో రంగుమారిన వైనం
● డీలర్, కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వేడుకోలు
రాయపర్తి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లైంది. ఓ రైతు పరిస్థితి. కలుపును నివారించి వరిపంటను కాపాడుకునేందుకు యత్నించిన రైతుకు డీలర్ ఇచ్చిన కలుపు నివారణ మందు శాపమైంది. మూడెకరాల్లో నాటిన వరిపంట పూర్తిగా ఎర్రబారిపోయింది. ఈ సంఘటన రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు అబ్బోజు సేనాపతి కథనం ప్రకారం గతనెల 19న వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డులోని ఎస్‌బీఐ పక్కన ఉన్న మాధురి ఏజెన్సీస్ పెస్టిసైడ్స్, సీడ్స్ ఫెర్టిలైజర్ దుకాణంలో నోవిక్సిడ్, తారక్ అనే కంపెనీలకు చెందిన పిచికారీ మందులను కొనుగోలు చేశాడు. ఆ మందులను వారం రోజుల క్రితం పిచికారీ చేయగా, మూడెకరాల్లోని వరి మొత్తం నిప్పుతో కాల్చిన విధంగా ఎర్రబారింది. ఈ విషయాన్ని వరంగల్‌లోని డీలర్‌కు తెలియజేయగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కంపెనీ ప్రతినిధులు పూజిత, కుమార్.. దాటవేసే ధోరణిలో వ్యవహరించారు. అధికారులు పంటక్షేత్రాన్ని సందర్శించి కంపెనీపై, తనకు మందులు ఇచ్చిన డీలర్‌పై చర్యలు తీసుకొని, పంట నష్టం అందేలా చొరవ తీసుకోవాలని బాధిత రైతు సేనాపతి వేడుకుంటున్నాడు. కార్యక్రమంలో గ్రామ రైతులు తీగల సాయిలు, బండి కుమార్, నిమ్మల రాజు, సల్ల కొంరయ్య, బొమ్మెర రవి, గడ్డం సుధాకర్, బండి సంతోష్, మామిండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రబారిన వరిపొలం