
‘టెక్స్‌టైల్’ పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్‌లో డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్‌ఓబీ, కుడా లేఅవుట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల టెక్స్‌టైల్ పార్కు మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించి అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించిందని గుర్తుచేశారు. టెక్స్‌టైల్ పార్కులో 12వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇండస్ట్రీయల్ జోనల్ మేనేజర్ స్వామి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్‌అండ్‌బీ డీఈ దేవిక, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న నోడల్ అధికారులతో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు.