
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు నడపలేం..
● ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జున్‌రెడ్డి
నెక్కొండ: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమెన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (బీఏఎస్) నిధులు విడుదల కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుకారుతోంది. మూడేళ్లుగా బీఏఎస్ నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయా స్కూల్స్ యాజమాన్యాలు నేటి (సోమవారం) నుంచి విద్యార్థులకు పాఠశాలల అనుమతి నిరాకరిస్తున్నామని బెస్ట్ అవైలబుల్ స్కూల్ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన సలహాదారుడు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగా ర్జున్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాజమాన్యాలు వడ్డీలకు అప్పులు తెచ్చి, నగలు తాకట్టు పెట్టి ఇప్పటి వరకు పాఠశాలలను నడిపించామన్నారు. గత బకాయిలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 32 స్కూళ్లు ఉన్నాయని, ఇందులో 3,500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారన్నారు. గతంలో నిధుల విడుదల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ, ఎస్టీ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌లను కలిసి విన్నవించామన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు, డీటీడబ్ల్యూ, డీఎస్‌డీఓ అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయామన్నారు. ఇకపై స్కూళ్ల నిర్వహణ ఆర్థిక భారాన్ని భరించలేమని, విద్యార్థులకు అనుమతించడం లేదని తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం స్పందించి బీఏఎస్ బకాయిలు చెల్లించాలని కోరారు.