
నిర్వహణ కనుమరుగు
మరుగుదొడ్ల పేరిట
కాసుల వేట
నిర్వహణకు ప్రతీ నెల రూ.50 లక్షలు
వివిధ పనుల నిమిత్తం రోజూ వరంగల్ నగరానికి వచ్చేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వారికి ఒకటికో రెంటికో వస్తే నరకమే. ఏ షాపింగ్ మాలో.. పెట్రోల్ బంకో.. బస్టాండ్, రైల్వే స్టేషన్‌కో పరుగులు పెట్టాల్సిందే. నగరంలో అక్కడక్కడా మరుగుదొడ్లు కనిపించినా ఆ కంపునకు దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. కొన్ని చోట్ల ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. – వరంగల్ అర్బన్
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రజా మరుగుదొడ్లు.. స్థలాల లేమి పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఈ నిర్మాణల్ల్లో పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలున్నాయి. అవేమీ చాలవన్నట్లుగా ఇప్పుడు నిర్వహణ పేరిట ప్రజా సొమ్ము వాటాలుగా పంపిణీ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో రెండున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మాయమయ్యాయి. అక్కడక్కడా మిగిలిన కొన్ని ప్రస్తుతం చెత్త కుప్పల్లా మారాయి. లూకేఫ్ సంస్థకు ఇచ్చిన కంటైనర్ తరహాలో ఏర్పాటు చేసినవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్లు రెండు బల్దియా ప్రధాన కార్యాలయంలో పార్కింగ్‌కే పరిమితయ్యాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో ఏర్పాటు చేసిన వాటికి కూడా అదే దుస్థితి. ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు ఏమేర అక్కరకు వస్తున్నాయో తెలియదు కానీ, ఏజెన్సీ, అధికారులు, సిబ్బందికి మాత్రం ఆర్థిక మేలు చేకూరుస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేరుకే వెయ్యి సీటర్లు..
నగరంలో ప్రత్యేకంగా ఆరు చోట్ల షీ టాయిలెట్లను నిర్మించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, బాలసముద్రం, సుబేదారి, ఖిలా వరంగల్ కోట, కాజీపేట, నయీంనగర్‌లో ఉండగా.. ఇవి నామ మాత్రంగానే నడుస్తున్నాయి. రూ.30 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన రెండు మొబైల్ షీ టాయిలెట్లు బస్సులు మూలకు చేరి తప్పుపడుతున్నాయి. హైదరాబాద్ తరహాలో నగరంలో ఆరు ఆధునిక టాయిలెట్లను సర్వాంగ సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట, నిట్, హనుమకొండ కలెక్టరేట్, భీమారం, టీబీ ఆస్పత్రి, హనుమకొండ పాత బస్‌డిపో, వరంగల్ పోచమ్మ మైదాన్, ఖిలా వరంగల్ కోట ఖుష్‌మహల్ దగ్గర ప్రస్తుతం ఇవి వాడకంలో ఉన్నాయి. వీటిలో సగం సీట్లు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ములుగురోడ్డు, మట్టెవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా, చార్‌బౌళి, అండర్ బ్రిడ్జి, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు మొత్తంగా రూ.10 కోట్లతో 88 చోట్ల 324 సీటర్లు నిర్మించారు. అందులో పది శాతం మాత్రమే ఉపయోగంలో ఉండగా.. 40ఽ శాతం నామమత్రంగా, మరో 50 శాతం తాళాలు పడ్డాయి.
ప్రైవేట్‌వి పని చేస్తున్నాయ్..
జీడబ్ల్యూఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లో బీఓటీ (బిల్డ్, ఓన్, ఆపరేట్) పద్ధతిలో నిర్మించి, రుసుము వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చారు. అలాంటివి నగరంలో సుమారు 60 వరకు 676 సీటర్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని చోట్ల (సులభ్ కాంప్లెక్స్)లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి రూ.5 చొప్పన రుసుము వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కొకరి నుంచి రూ.10 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరుగుదొడ్ల తనిఖీలపై బల్దియా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను తనిఖీ చేస్తాం. నిర్వహణ ఉన్న టాయిలెట్లకు నిధులు మంజూరు చేస్తాం. లేకపోతే రద్దు చేస్తాం.
– రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్‌ఓ
రూ.10 కోట్లతో 88 నిర్మాణాలు
వినియోగంలో ఉన్నవి 10 శాతమే.. లేకున్నా బిల్లుల చెల్లింపులు
ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అంటూ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లలో సగం కనుమరుగయ్యాయి. రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని పని చేయడం లేదు. మరికొన్ని అపరిశుభ్ర వాతావరణంలో చెత్తకుప్పలుగా మారాయి. ప్రతీ నెల పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నా.. ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంపై పౌరులు మండిపడుతున్నారు. మూడేళ్లుగా అధునాతన మరుగుదొడ్ల నిర్వహణకు ఓ ఏజెన్సీకి కట్టబెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. కానీ, 90 శాతానికిపైగా పనిచేయడం లేదు. చాలా చోట్ల నీటి, విద్యుత్ సదుపాయాలు లేక కొన్ని మూలకు చేరాయి. కనీసం డోర్లు లేక మరికొన్ని అధ్వానంగా మారాయి. ఈ లెక్కాపత్రాలను వెల్లడించేందుకు ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు ససేమిరా.. అంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.