
దసరా సంబురం
ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో అంబరాన్నంటిన వేడుకలు
● 70 అడుగుల
రావణుడి ప్రతిమ దహనం
● కిక్కిరిసిన ఉర్సు,
కరీమాబాద్ రహదారులు
● హాజరైన మంత్రి కొండా సురేఖ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్ : వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో గురువారం రాత్రి దసరా వేడుకలు అంబరాన్నంటాయి. భక్తుల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో ప్రాంగణమంతా మార్మోగింది. లక్షలాదిగా తరలివచ్చిన జనసందోహంతో ఉర్సు, కరీమాబాద్ రహదారులు కిక్కిరిసిపోయాయి. దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఘట్టంగా రథయాత్ర..
కరీమాబాద్ రామస్వామి గుడి నుంచి సీతారామాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాల ను రథంపై ప్రతిష్ఠించి దాండియా నృత్యాలు, కోలాటం, డప్పుచప్పుళ్ల నడుమ రంగలీల మైదానికి చేరుకున్నారు. అనంతరం వేదపండితులు శమీపూజ నిర్వహించి భక్తులతో పాలపిట్ట దర్శనం చేయించారు.
ఎలక్ట్రిక్ రావణుడి ప్రతిమ దహనం..
రంగలీల మైదానంలో 10 తలలతో కూడిన 70 అడుగుల రావణాసురుడి ప్రతిమ ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరం ద్వారా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్ చేసి రావణుడి ప్రతిమ దహన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. 100 మంది సాంకేతిక నిపుణులు పేల్చిన బాణసంచా మోతలతో రంగలీల మైదానం దద్దరిల్లింది.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన పేరిణి, శివతాండవం, కూచిపూడి నృత్యాలు అలరించాయి. రాణిరుద్రమ వేషధారణ, జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు భక్తులను కనువిందు చేశాయి. యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.
పోలీసుల బందోబస్తు..
ప్రజాప్రతినిధులు రాక ఆలస్యం కావడంతో రాత్రి 8:30 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పర్యవేక్షణలో మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎస్సైలు, పోలీసుల బందోబస్తు నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణంలో దసరా సంబురాలు ముగిశాయి.

దసరా సంబురం

దసరా సంబురం