జెడ్పీ పీఠంపై కన్ను! | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠంపై కన్ను!

Oct 2 2025 7:46 AM | Updated on Oct 2 2025 7:46 AM

జెడ్పీ పీఠంపై కన్ను!

జెడ్పీ పీఠంపై కన్ను!

జెడ్పీ పీఠంపై కన్ను! ఎమ్మెల్యే దొంతి ఆశీస్సులు ఎవరికో?

వరంగల్‌ జెడ్పీ స్థానం ఎస్టీకి రిజర్వు

స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి కీలకం కానున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి ఖానాపురం, నర్సంపేట రూరల్‌ స్థానాల్లో గెలిచిన వారు జెడ్పీచైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆశీస్సుల కోసం రెండు మండలాలకు చెందిన ఎస్టీ సామాజికవర్గ నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా సింగ్‌లాల్‌ పేరు వినిపిస్తుంది. ఈయనతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పూల్‌సింగ్‌, సారంగం, పకీర్‌లతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సింగ్‌లాల్‌కు జెడ్పీటీసీ అవకాశం కలిగితే చైర్మన్‌ పీఠం కై వసం చేసుకోవడానికి సైతం ఎమ్మెల్యే మాధవరెడ్డి మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది.

నర్సంపేట: వరంగల్‌ జెడ్పీ చైర్మన్‌ పీఠంపై ఖానాపురం కన్నేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడానికి ఆశావహులు ఆశల పల్లకిలో తేలియాడుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి బీ ఫాం కోసం ఇప్పటి నుంచే పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆయా పార్టీల పెద్దల ఆశీస్సులు పొంది జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎవరిని వరిస్తాయో అంటూ ఖానాపురంలో ఆసక్తి రేపుతున్నాయి.

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్‌లు పొంది గెలుపు కోసం సిద్ధమవుతున్నారు. వరంగల్‌ జెడ్పీస్థానం ఎస్టీకి రిజర్వు కావడంతో జిల్లాలో జెడ్పీటీసీ స్థానాల్లో ఖానాపురం ఎస్టీ జనరల్‌, నర్సంపేట రూరల్‌ ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. దీంతో జెడ్పీ చైర్మన్‌ పోటీకి నర్సంపేట నియోజకవర్గంలోని రెండు మండలాలకు మాత్రమే అవకాశం దక్కనుంది. రెండు స్థానాల నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతుండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకే అభ్యర్థి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి జెడ్పీటీసీగా గెలిస్తే జెడ్పీ చైర్మన్‌ స్థానాన్ని కై వసం చేసుకొని భవిష్యత్‌లో రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇరుపార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోవడానికి పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక దృష్టి..

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఖానాపురం జెడ్పీటీసీ అభ్యర్థి నియామకానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సైతం ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి జెడ్పీటీసీగా గెలుపు వరిస్తే జిల్లాలోని సమీకరణాలతో జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉండటంతో ఎంపిక కీలకం కానుంది. ఖానాపురం నుంచి ప్రధానంగా బాధావత్‌ బాలకిషన్‌, దబ్బీర్‌పేటకు చెందిన రాజు, ఐనపల్లికి చెందిన రామస్వామిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిలో పలువురు నాయకులు తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులను మచ్చిక చేసుకొని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు పరుగులు పెడుతున్నారు. తమకు సీటు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు సామాజిక నాయకులతో పాటు ఆయా గ్రామాల్లోని మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి మద్దతు కూడగట్టుకోవడంతో పాటు తాయిలాల సమర్పణ సైతం మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రెండు పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులను ఎంపిక చేసి జెడ్పీచైర్మన్‌ పీఠం కై వసానికి అడుగులు వేస్తుండటంతో నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తి రేపుతున్న పరిస్థితి నెలకొంది.

ఖానాపురం, నర్సంపేట రూరల్‌ జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీకి కేటాయింపు

ఈ స్థానాల్లో గెలిస్తే జెడ్పీ పీఠం ఖాయం

ఎమ్మెల్యే దొంతి ఆశీస్సులు ఎవరికో?

బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ఆశావహుల పోటీ

ఆసక్తి రేపుతున్న ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement