
జూడా నాయకుల ఏకగ్రీవ ఎన్నిక
ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్‌లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫైమా జాతీయ కో–చైర్మన్‌గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన ప్రాతినిథ్యం వహిస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీరికి జూడా నాయకులు, వైద్య సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూశాయంపేట: మైనార్టీ పథకాల దరఖాస్తు కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ యాకూబ్‌పాషా మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 6 వరకు గడువు ఉన్నా సోమవారం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా వెబ్‌సైట్‌ను నిలిపేశారన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ కారణంగా సైట్ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే పథకం ప్రారంభమైనందున సైట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈవిద్యాసంవత్సరంలో 45 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్కో పాఠశాలకు ప్రీప్రైమరీ తరగతుల విద్యాబోధనకు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయా నియామకానికి జిల్లా విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. 45 ప్రీప్రైమరీ తరగతులకు 45 మంది ఇన్‌స్ట్రక్టర్లకు, 45 మంది ఆయాలకు దరఖాస్తులు స్వీకరించారు. ఇన్‌స్ట్రక్టర్లకు ఇంటర్ అర్హత నిర్ణయించగా.. 1,114 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆయాలకు ఏడో తరగతి అర్హత ఉండగా.. 267 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎక్కువగా దరఖాస్తులు రావడంతో కొద్ది రోజులుగా వాటిని పరిశీలించి కసరత్తు చేసి 45 మంది ఆయాలుగా ఎంపిక చేశారు. 44 మంది ఇన్‌స్ట్రక్టర్లను ఎంపిక చేశారు. జిల్లాలోని పెద్దకొడపాక బాలుర ప్రాథమిక పాఠశాలకు ఇన్‌స్ట్రక్టర్‌గా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఈఎంపిక ప్రక్రియకు కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నారు. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఇన్‌స్ట్రక్టర్ల, ఆయాల జాబితాను వెల్లడించారు. ప్రతీ నెల ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6 వేలు చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు.
విద్యారణ్యపురి: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని, ఉద్యోగ విరమణకు ఆరు నెలలలోపు సమయం ఉన్నవారిని మినహాయించాలని మంగళవారం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు ఇతర బాధ్యులు జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా ఏడాదిలోపు వయస్సున్న పిల్లల తల్లులకు, గర్భిణి ఉద్యోగులకు వివిధ శస్త్ర చికిత్సలు చేసుకున్నవారిని, దివ్యాంగ ఉద్యోగులకు ఈ ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్పందించిన లక్ష్మీరమాకాంత్ ఒక కమిటీని మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రాజు తెలిపారు. సీనియార్టీ స్కేల్స్ ప్రాతిపదికన ఎన్నికల బాధ్యతలను అప్పగించాలని తాము కోరినట్లు రాజు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్, జిల్లా కార్యదర్శి సీఎస్‌ఆర్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

జూడా నాయకుల ఏకగ్రీవ ఎన్నిక

జూడా నాయకుల ఏకగ్రీవ ఎన్నిక