
తప్పుల తడకగా రిజర్వేషన్లు!
కమలాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లన్నీ తప్పులతడక అని, ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్‌లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సమస్యలను మొదటగా పట్టించుకునేది వార్డు స్థాయిలో వార్డు సభ్యుడు, గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్, మండల స్థాయిలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లని, రెండేళ్లయినా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలన్నీ వల్ల కాడులుగా మారిపోయాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప కింద రాజకీయ వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు సౌకర్యాలు మెరుగు పర్చాలని అనేక సార్లు డిమాండ్ చేశామని, నిన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కౌన్సిల్‌లో, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారో దానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఆ తీర్మానాన్ని విజయవంతం చేయడంలో తాము కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేశామని, తాము బీసీల 42 శాతం రిజర్వేషన్లకు విరుద్ధమైనోళ్లం కాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సీతంపేట, శ్రీరాములపేట, వాగొడ్డు రామన్నపల్లిలో కమలాపూర్ మండలంలోని గుండేడులో ఒకటో, రెండో వైశ్య కుటుంబాలు ఉన్నా అక్కడ ఓసీలకు రిజర్వ్ చేశారన్నారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే 119 నియోజకవర్గాల్లో ఎన్ని తప్పులు దొర్లి ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని, ఎన్నికలు నిర్వహించాలనే తాము కోరుకుంటున్నామని, తమపై బురద జల్లి దాడి చేసే ప్రయత్నం చేయవద్దన్నారు. ఇప్పటికై నా వెంటనే తాము ప్రకటించిన రిజర్వేషన్లను యఽథావిధిగా కొనసాగిస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందకు పూర్తి బాధ్యత మాదేనని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, బీజేపీ నాయకులు దేశిని సదానందంగౌడ్, మాడ గౌతంరెడ్డి, బండి కళాధర్, చేలిక శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల పేరిట ఊళ్లల్లో గందరగోళం.. కావాలనే ప్రభుత్వం చేస్తోంది....
హుజూరాబాద్ నియోజకవర్గంలో రిజర్వేషన్లలో అక్రమాలు
బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ
ఈటల రాజేందర్