
సిద్ధిధాత్రి అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో ఖడ్గమాల, నవవర్ణ అర్చన, అలంకారం, శ్రీచక్రార్చన, నిత్యాహ్నికం, శ్రీ సూక్తపారాయణం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ మాట్లాడుతూ.. సిద్ధిధాత్రి రూపంలో అమ్మవారు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ్వితం, వశిత్వం అనే అష్టసిద్ధులు ప్రసాదిస్తుందని తెలియజేశారు. ఈమె కరుణతోనే పార్వతీదేవి శివుడి అర్ధ శరీరం పొందినట్లుగా పురాణ కథనం ఉందన్నారు. అమ్మవారి వాహనం సింహం, చతుర్భుజాలతో కమలంపై ఆసీనురాలై ఉంటుందన్నారు. కుడి వైపు చేతులలో శంఖం, గద, ఎడమ వైపు చేతులలో శంఖం, కమలం ఉంటుందని భక్తులకు వివరించారు. ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్ శర్మ, దేవేందర్, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.