
ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌గా రోహిత్ నేత
కమలాపూర్: మండల కేంద్రానికి చెందిన తౌటం రోహిత్ నేత ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. తౌటం సురేందర్–రాధిక దంపతుల కుమారుడు రోహిత్. తండ్రి సురేందర్ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్, తల్లి రాధిక గృహిణి, సోదరి సౌమ్య ఉన్నత విద్య కోసం యూఎస్‌ఏ వెళ్లారు. రోహిత్ ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఇంటర్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత ప్రతిభ కనబర్చిన రోహిత్ బీటెక్ పూర్తి కాగానే ఏడాది పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగం వదిలి రెండేళ్లు సివిల్స్, గ్రూప్–1 కోసం కఠోర సాధన చేసి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వద్ద రిపోర్ట్ చేశాడు. రోహిత్ నేత మాట్లాడుతూ... ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగం వదిలేసినా తనను తన తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించారని, ఉన్నత స్థితికి తన తల్లిదండ్రులే కారణమని కొనియాడాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన తాను బలహీన వర్గాల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, అందుకే పేదల అభ్యున్నతి కోసం సేవ చేయాలన్నదే తన ఏకై క లక్ష్యమని, ఈ బాధ్యతను ఒక అవకాశంగా మాత్రమే కాకుండా తన పవిత్ర ధర్మంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన పరిపాలనా విధానంలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, యువ, మహిళా శక్తీకరణకు ప్రాధాన్యమిస్తానని తెలిపారు.