
రెండు విడతల్లో ఎన్నికలు
● కలెక్టర్ సత్యశారద
● రాజకీయ పార్టీల ప్రతినిధులతో
సమావేశం
న్యూశాయంపేట: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. అక్టోబర్ 23న మొదటి విడతలో వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలు (గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట), 27న రెండవ విడతలో నర్సంపేట డివిజన్ పరిధిలోని 6 మండలాలు (చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురం) మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు జిల్లాల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో 5 మండలాల్లో 157 సర్పంచ్, 1,350 ఎంపీటీసీలకు, రెండవ విడతలో 6 మండలాల్లో 160 సర్పంచ్, 1,404 వార్డుల సభ్యులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తంగా జిల్లాలోని 317 గ్రామపంచాయతీల్లో 2,754 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన రోజున ఫలితాలు వెలువడతాయని, ఆ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు ప్రతీ మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్‌ఓను నియమిస్తున్నామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, దరవాత్తు, వివరాలు, ఎన్నికల వ్యయం నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి వివరించారు. అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా అధికా రులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో ఈ నెల 2న జరిగే దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని, అందుకు తగిన ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీమాబాద్ ఉర్సు రంగలీల మైదానంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీసీపీ సలీమా, ఏఎస్పీ శుభం, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రంగలీల మైదానంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు, రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్ ఇక్బాల్, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్, ఉపాధ్యక్షుడు గొనె రాంప్రసాద్, కోశాధికారి మండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.