
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● ఇన్‌చార్డ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి
నర్సంపేట రూరల్: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి హెచ్చరించారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామపంచాయతీలకు సంబంధించి 2024–25 సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పనుల 16వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. పనుల్లో మస్టర్లు సక్రమంగా రాయకపోవడం, కొలతలు సరిగా తీయకపోవడం, పనిప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం, ఒకే పనిపై రెండుసార్లు మస్టర్ల రాయడం తదితర వాటిని తనిఖీ బృందంగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వీటిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో రూ.46,558 రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు 3,825, ఫీల్డ్ అసిస్టెంట్లు 25,090, టెక్నికల్ అసిస్టెంట్లు 4,245, ఈసీ 1,000, ఏపీఓ 1,000, ఏఈ 1,531, ఇతరుల నుంచి 9,867 రికవరీ చేయాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్ అధికారి అలివేలు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి మాధవి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి పుష్పలత, డీఆర్‌డీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రమేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రామ్మోహన్, ఏపీఓ ఫాతిమామేరీ, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎఫ్‌ఏలు, సామాజిక తనిఖీ బృందం అధికారులు తదితరులు పాల్గొన్నారు.