
బతుకమ్మ చీరలు సిద్ధం
● మహిళా సంఘాల ద్వారా పంపిణీ
● జిల్లాలో 435 గ్రామైక్య సంఘాలు
● 11,257 స్వయం సహాయక సంఘాలు
నర్సంపేట: తెలంగాణ ఆడపడుచులు ఇష్టంగా నిర్వహించుకునే వేడుక బతుకమ్మ. ఎంతో చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగకు కానుకగా మహిళలకు ప్రభుత్వం కానుకగా చీరలు అందించేందుకు సిద్ధమైంది. గతంలో రేషన్ కార్డుల ఆధారంగా చీరలు పంపిణీ చేయగా.. ఈసారి కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే ఈ చీరలను అందించనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను లెక్కించారు. వీరందరికీ చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీ బాధ్యతలను మెప్మా సిబ్బందికి అప్పగించారు. జిల్లా, మండల స్థాయిలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి గ్రామాలకు తరలించి సభ్యులకు అందజేస్తారు. రెండు రకాల సైజుల్లో 6.5మీటర్లు, 9మీటర్ల చీరలు అందుబాటులో ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు చీరలు ఇవ్వడం ఇదే మొదటిసారి. చీరల పంపిణీతో మహిళల గౌరవాన్ని పెంచడంతోపాటు చేనేత రంగానికి చేయూతనిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
మహిళా సంఘాల్లోని వారికే..
గత ప్రభుత్వ హయాంలో 18 సంవత్సరాలు నిండిన తెల్ల రేషన్‌కార్డు కలిగిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేస్తూ సంఘంలో ఉన్న సభ్యులకు అందజేసే విధంగా మండల స్థాయి అధికారులకు బాధ్యత అప్పగించనుంది. వరంగల్ జిల్లాలో 435 గ్రామైక్య సంఘాలు, 11,257 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారుగా లక్షా 22వేల 389మంది సభ్యులు ఉండగా వీరందరికీ బతుకమ్మ కానుకగా చీరలు అందించనున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చీరలను జిల్లాలకు పంపిస్తున్నట్లు తెలిసింది.
రెండు కాదు.. ఒకటే..!
గత ప్రభుత్వ హయాంలో చీరల నాణ్యతపరంగా కొంత మంది మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేసి నిరసన తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్వాలిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రెస్ కోడ్‌లో భాగంగా అన్ని ఒకే రంగుతో ఒకే విధంగా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మొదట రెండు చీరలు ఇవ్వాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఒక చీర అందించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 6.30మీటర్ల చీరలు, తొమ్మిది మీటర్ల చీరలు సిద్ధం చేశారు.
మార్గదర్శకాలు
రూపొందిస్తున్నాం..
బతుకమ్మ పండుగ సమీపిస్తుండడంతో చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. మండలాలకు పంపిణీ చేసే ప్రక్రియపై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు అందిస్తాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం.
– రాంరెడ్డి,
ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ

బతుకమ్మ చీరలు సిద్ధం