
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం
కేయూ క్యాంపస్: తెలంగాణా ప్రజల సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ విభాగం, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ విభాగాల వద్ద విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ముందుస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పాల్గొని మాట్లాడారు. ప్రకృతిని, పూలనే దైవంగా పూజించే వేడుక బతుకమ్మ అని ఆయన అభివర్ణించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఉత్సాహంగా వేడకల్లో పాల్గొని పాటలు పాడారు. ఆయా విభాగాల మహిళా అధ్యాపకులు డాక్టర్ రమ, మేఘనరావు, అమరవేణి, వరలక్ష్మి, మమత, సవితాజ్యోత్స్న, దీపాజ్యోతి, డాక్టర్ సౌజన్య, నీలిమ, ప్రగతి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, ఆచార్య నర్సింహాచారి అధ్యాపకులు పాల్గొన్నారు.