
తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు
సాక్షి, వరంగల్: జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జూలైలో 1,182 వాహనాలు రిజిస్ట్రేషన్లు అయితే ఆగస్టులో ఆ సంఖ్య పెరిగి 1,297కు చేరుకుంది. కానీ, సెప్టెంబర్‌లో మాత్రం 552 వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. కార్లు, బైక్‌లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించడంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు. దీంతోపాటు దసరా పండుగ వస్తుండడంతో ఈ నెల 22 తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు జోరందుకుంటాయని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కార్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గుతుండడం వాహనదారులకు రూ.వేలల్లో నుంచి రూ.లక్షల్లో ఉపశమనం కలిగించే అంశమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్లు తగ్గినా దసరాలోపు భారీగానే పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో రవాణా శాఖకు వచ్చే ఆదాయానికి ఏమాత్రం ఢోకా ఉండకపోవచ్చు. జిల్లాలో ఇప్పటికే 2.30 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి.
తగ్గనున్న ధరలు..
నగర పరిధిలో బైకులు, కార్ల షోరూంలు సుమారు 30కి పైగా ఉన్నాయి. ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గనుంది. భారీ ఎంటీ లెవల్ హ్యాచ్ బైక్ నుంచి లగ్జరీ ఎస్.యూవీ కార్ల వరకు ధరలు తగ్గనున్నాయి. దీంతో వాహనాలు కొనాలనుకునేవారు ఇప్పటికే ధరలు ఏమేర తగ్గుతాయని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. బైక్ కొనాలనుకునేవారికి రూ.20 వేల నుంచి రూ.35 వేలు, కారు కొనుగోలు చేస్తే కనిష్టంగా రూ.65 వేల నుంచి గరిష్టంగా రూ.లక్షన్నర వరకు తగ్గొచ్చొని విక్రయదారులు చెబుతున్నారు. ప్రతి ఏటా దసరా, దీపావళికి 240 నుంచి 350 వరకు కార్ల అమ్మకాలు జరుగుతుండేవని, ఈసారి ఆ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చంటున్నారు. పలు కంపెనీ లు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈనెల 22లోగా ముందుస్తు బుకింగ్ చేసుకునే వారికి చిన్న కారుపై రూ.80 వేలు తగ్గింపుతోపాటు కారు డెలివరీ సమయంలో జీఎస్టీ తగ్గింపు అమలు చేస్తామని ఆఫర్ చేస్తుండడంతో కొందరు ఇప్పటికే బుకింగ్ చేసుకుంటున్నారు.
కొనుగోళ్లపై మారనున్న జీఎస్టీ శాతం
ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో సగం కంటే తక్కువే..
భారీగా పడిపోయిన కారు, బైక్‌ల విక్రయాలు
ఈ నెల 22 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజు కుంటాయంటున్న ఆర్టీఏ అధికారులు