హసన్‌పర్తి: బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్‌నాయక్ (42) జవహర్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్ స్కూల్‌లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి కేయూ జంక్షన్ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.