
కాంగ్రెస్‌ది ప్రజాకంఠక పాలన
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: కాంగ్రెస్‌ది ప్రజాకంఠక పాలన అని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దుయ్యబట్టారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించామన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టడం, మైనారిటీలను ఎమ్మెల్యేగా, మంత్రిని చేయకపోవడం ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. అన్నదాతలను ఆగం చేయడం, యూరియా అందించకపోవడం, రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయేలా చేయడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం ప్రజాపాలన అని నిలదీశారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. అమాయకులను హతమారుస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, తండమల్ల వేణు, కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, బండి రజనీకుమార్, దూలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.