
వడివడిగా అడుగులు
సాక్షి, వరంగల్: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో మరో రెండు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కేరళ కేంద్రంగా ఉన్న చిన్నపిల్లల దుస్తులు తయారుచేసే కై టెక్స్ కంపెనీతోపాటు దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ కంపెనీ కూడా కొన్ని షెడ్లు నిర్మించి తమ ఉత్పత్తుల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి. మరో రెండు నుంచి మూడు నెలల్లో తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కంపెనీల ఉత్పత్తులు ప్రారంభించేందుకు ఆలోచన చేస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టెక్స్‌టైల్ పార్కులో 22 కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకుంటే రెండు కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. ఇప్పుడు మరో రెండు ప్రధాన కంపెనీలు ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. వీటి ద్వారా 35వేలకుపైగా ఉద్యోగాలు రానున్నాయి.
కై టెక్స్ రూ.1200 కోట్ల పెట్టుబడి..
కై టెక్స్ కంపెనీ యార్న్, ఫ్యాబ్రిక్, ఇన్నర్, ఔటర్ వియర్, సాక్స్‌లు, అసెసరీస్, ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీ చేసేందుకు సకల హంగులతో నిర్మాణాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఒక్కొక్కటి 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు పెద్ద షెడ్లను నిర్మించారు. రూ.1200 కోట్ల పెట్టబడులతో 191 ఎకరాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ముడి పత్తి నుంచి జిన్నింగ్, ప్రెస్సింగ్, స్పిన్నింగ్ ప్రాసెస్ ప్రారంభమై ట్రయల్ రన్ నడుస్తోంది. మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో కంపెనీ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇందులో 25,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కంపెనీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.
యంగ్‌వన్ రూ.980 కోట్ల పెట్టుబడి..
దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ (ఎవర్ టాప్ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ 297.59 ఎకరాల్లో రూ.980 కోట్ల పెట్టుబడితో క్రీడా దుస్తులు, బూట్లు, ఇతర దుస్తులు తయారుచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిర్మించిన ఐదు షెడ్లలో ఉత్పత్తుల కోసం ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ కంపెనీ ద్వారా 11,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది కూడా సాధ్యమైనంత తొందర్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే యూపీలోని కాన్పూర్ కేంద్రంగా ఉన్న గణేశ్ ఎకోటెక్ కంపెనీ 50 ఎకరాల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో రెండు యూనిట్లు స్థాపించింది. వాడిన ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి యార్న్, బాటిల్స్‌ను తయారు చేస్తోంది. ఇందులో సుమారు 450 మంది పనిచేస్తున్నారు.
వస్త్ర పరిశ్రమలో కై టెక్స్, యంగ్‌వన్ కంపెనీల ట్రయల్ రన్
రెండు నెలల్లో మార్కెట్‌లోకి రానున్న ఉత్పత్తులు
35వేల మందికిపైగా ఉద్యోగావకాశాలు
చకచకా వసతుల కల్పన..
1350 ఎకరాల్లోని మెగా టెక్స్‌టైల్ పార్కులో గత బీఆర్‌ఎస్ సర్కారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ. 160 కోట్లు భూసేకరణ కోసం రైతులకు పరిహారం చెల్లించింది. పార్కులో వరద కాల్వ నిర్మాణం కోసం రూ.159తో పనులు జరుగుతున్నాయి. పీఎం మిత్రలో రూ.200 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఇంత వరకు మంజూరు కాలేదు. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం, రెండు 132 కేవీ లైన్ల కోసం రూ.209 కోట్లు కేటాయించారు. చలివాగు నుంచి నీటిని సరఫరా కోసం సుమారు 45 కి.మీ పొడవులో పైపులైన్ బిగించారు. ఒక ఎంఎల్‌డీ, ఐదు ఎంఎల్‌డీ (ఒక ఎంఎల్‌డీ అంటే పది లక్షల లీటర్ల నీరు) అందించనున్నారు. భూ నిర్వాసితులకు 823 ప్లాట్లు కేటాయించి రాజీవ్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో వాటర్ సప్లయ్, సీవరేజ్ ప్లాంట్, వీధి దీపాలు, ఎల్‌టీ లైన్, మురుగు వాటర్ డ్రెయిన్, ట్రీట్‌మెంట్ ప్లాంటు, వాటర్ ట్యాంకు కోసం రూ.14 కోట్ల నిధులతో పనులకు టెండర్లు పూర్తయ్యాయి. 50 గజాల స్థలం వచ్చిన వారికి 70 గజాలు చేస్తూ 187 మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. రూ.5.50 కోట్లతో స్కూల్, పీహెచ్‌సీ, జీపీ భవనం, వెటర్నరీ ఆస్పత్రి పనులు జరుగనున్నాయి. మౌలిక వసతుల కోసం రూ.14 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. 2024 నవంబర్ 19న వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన చేశారు.

వడివడిగా అడుగులు