
రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం..
నెక్కొండ: రైతులకు అన్యాయం చేస్తూ ఇబ్బంది పెడితే ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు బల్ల వెంకన్న, మాదాసు రవి, జి.కుమార్ అన్నారు. రెడ్లవాడ తోపనపల్లి పీఏసీఎస్ సబ్ సెంటర్ వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే యూరియా కోసం అలంకానిపేట, బొల్లికొండ, వెంకటాపురం, తోపనపల్లి రైతులు బారులుదీరారు. 8 గంటలకు లారీలో 444 బస్తాల యూరియా వచ్చింది. అప్పటికే 750 మంది రైతులు క్యూలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 222 మంది రైతులకు రెండేసి బస్తాల చొప్పున పంపిణీ చేయించగా.. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. దీంతో మిగిలిన వారు నాయకులతో కలిసి గ్రామ ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం గంటల తరబడి రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాసేలా ప్రభుత్వం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సూరం రాజిరెడ్డి, కర్పూరపు శ్రీనివాస్, రవీందర్‌రావు, నవీన్, వినోద్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం..