
ఎమ్మెల్యేల మధ్య ఇసుక దుమారం!
సాక్షిప్రతినిధి, వరంగల్/పరకాల: అధికార పార్టీకి చెందిన పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణల నడుమ ఇసుక సరఫరా విషయంలో మాటల యుద్ధం జరిగిందా..? పరకాల నియోజకవర్గానికి భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగులనుంచి ఇసుక తరలింపు నిలిచిపోయిందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉచిత ఇసుక సరఫరా విషయంలో మొదలైన ఈ పంచాయితీ పార్టీ కార్యకర్తల వరకు పాకిందా?.. అంటే నిజమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కేడర్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. కొద్ది రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగులనుంచి పరకాల నియోజకవర్గానికి ఇసుక తరలకుండా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు గస్తీ కాయడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల మధ్య ఇసుక రవాణాపై సంభాషణ జరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు ఈ పంచాయితీ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లిందన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
భూపాలపల్లి ఇసుక.. పరకాలకు తరలకుండా..
అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలనెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఉచితంగా ఇసుక తరలింపునకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సమీప ప్రాంతాల్లో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడినుంచి సరఫరా చేయాలని సూచించింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏ ఒక్క వాగునుంచి ఇసుక ట్రాక్టర్ పరకాలకు తరలివెళ్లకుండా రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కట్టడి చేస్తున్నారు. మండలాల సరిహద్దుల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్ల సిబ్బంది రాత్రివేళలో మఫ్టీలో సంచరిస్తూ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నారని పరకాల వాసులు చెబుతున్నారు. కేసులు పెట్టడానికి కూడ వెనుకడుగు వేయకపోవడంతో పరకాలకు ఇసుక తరలింపు నిలిచిపోయిందని అంటున్నారు. ఇదేంటని అడిగితే పోలీసు, రెవెన్యూ అధికారులు పరకాలకు ఇసుక వెళ్తే చర్యలు తీసుకోవాలంటూ భూపాలపల్లి ఎమ్మెల్యేనుంచి ఆదేశాలున్నాయని చెబుతున్నారని పరకాల కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో చిట్యాల మండలంలోని టేకుమట్ల, కాల్వపల్లి, కలకోటపల్లి, మొగుళ్లపల్లి మండలంలోని నవాబుపేట, ఇస్సిపేట, కొర్కిశాల, రేగొండ మండలంలోని కనపర్తి వాగుల నుంచి పరకాలకు ఇసుక తరలించకుండా ఆంక్షలు విఽధించినట్లు సమాచారం.
ఆకాశన్నంటిన ఇసుక ధర..
గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక క్వారీలు 15 ఉండగా, వర్షాల కారణంగా అందులో 14 క్వారీలు నీట మునిగాయి. మిగతా ఒక్కటి అడవి సోమన్నపల్లి నుంచి మాత్రమే ఇసుకను తరలిస్తున్నారు. గతంలో ఒక్కో టన్నుకు రూ.800 నుంచి రూ.1000 ఉండగా ప్రస్తుతం మూడు రెట్లు అంటే రూ.2,500 వరకు నడుస్తుంది. అంటే ఒక్కో లారీ 32 టన్నులు అంటే రూ.80వేలు అవుతుంది. అంత ధర సామాన్యుడు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పొరుగు జిల్లానుంచి, వాగుల నుంచి ఇసుక తరలించుకోవడంపై ఆంక్షలు విధించడం పరకాల నియోజకవర్గంలోని తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌చార్జ్ మంత్రి వద్దకు ఇసుక పంచాయితీ
భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్‌రెడ్డిల మధ్య నెలకొన్న ఇసుక పంచాయితీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరకు వెళ్లినట్లు తెలిసింది. భూపాలపల్లి నుంచి ఇసుక రాకుండా ఆంక్షలు విధించడంపై మొదట ఎమ్మెల్యే సత్యనారాయణతో మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి.. ఫలితం లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి... ఈ మధ్యలో నిర్వహించే రివ్యూ మీటింగ్‌లో భూపాలపల్లి ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. కాగా, ఇన్‌చార్జ్ మంత్రి జోక్యంతోనైనా పరకాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సమస్య తీరుతుందా..? లేదా? అనేది చూడాలి మరి.
రేవూరి ప్రకాష్‌రెడ్డి వర్సెస్ గండ్ర సత్యనారాయణ
భూపాలపల్లి ఇసుక పరకాలకు వెళ్లకుండా ఎమ్మెల్యే ఆంక్షలు?
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి
‘పొంగులేటి’ వద్దకు చేరిన పంచాయితీ