
నాణ్యమైన భోజనం అందించాలి
ఖానాపురం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధరావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలు సరిగా లేకపోవడంతో ఉపాధ్యాయుడిని మందలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కొత్త బియ్యం వాడుతున్నామని మధ్యాహ్న భోజన ఇన్‌చార్జ్ ఉపాధ్యాయుడు చెప్పాడు. మరోసారి పరిశీలించగా పాతబియ్యం అని తేలడంతో ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఐనపల్లిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. స్టోర్‌రూంలోని పాడైన బీట్‌రూట్, టమాటాలను స్వాధీనం చేసుకుని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపించి, కాంట్రాక్టర్‌ను తొలగించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కారం ఎక్కువగా వాడుతున్నందుకు అసహనం వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు బోధించారు. ఆమె వెంట డీఏఓ అనురాధ, తహసీల్దార్ రమేశ్, ఏఓ శ్రీనివాస్ ఉన్నారు.
క్యూఆర్‌కోడ్‌లు ఏర్పాటు చేయండి..
యూరియా పంపిణీ సమయంలో రైతులకు పేటీఎం (క్యూఆర్‌కోడ్)లను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధరావుపేట శివారులో యూరియా పంపిణీని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నగదు పంపిణీ చేస్తుండడంతో ఆలస్యమవుతోందని, పేటీఎం క్యూఆర్‌కోడ్‌లు ఏర్పాటు చేస్తే సమయం ఆదా అవుతుందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. మంగళవారిపేట, బుధరావుపేటకు వేర్వేరుగా యూరియా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీసీఓకు సూచించారు. డీఏఓ అనురాధ, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గురుకులాలను తనిఖీ చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ప్రత్యేక అధికారులు తరుచూ తనిఖీలు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించిన ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
బుధరావుపేట, ఐనపల్లిలో
పాఠశాలల తనిఖీ