కుళ్లిన కూరగాయలతో కూరలా? | - | Sakshi
Sakshi News home page

కుళ్లిన కూరగాయలతో కూరలా?

Aug 1 2025 5:52 AM | Updated on Aug 1 2025 5:52 AM

కుళ్లిన కూరగాయలతో కూరలా?

కుళ్లిన కూరగాయలతో కూరలా?

దుగ్గొండి: కుళ్లిపోయిన కూరగాయలు.. నాణ్యతలేని మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టుతో కూరలు వండి పెడితే బాలికల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు.. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారా.. మిమ్ములను ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదు అంటూ కలెక్టర్‌ సత్యశారద మల్లంపల్లి కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఫుడ్‌ఇన్‌చార్జ్‌, వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూర్బాగాంధీ పాఠశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. కుళ్లిన కూరగాయలు, నాణ్యతలేని అల్లం పేస్ట్‌ కనిపించడంతో ప్రత్యేక అధికారి మంజులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వంట మనుషులను తొలగించాలని, కిచెన్‌ను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. భోజనంలో కారం, పులుపు అధికంగా వాడుతున్నారని విద్యార్థినులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కూరలో మునిగాకు ఎందుకు వేయడం లేదని ఎస్‌ఓను ప్రశ్నించారు. ఫిర్యాదుల పెట్టెను తెరిచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

బాలికలకు కిశోర్‌రక్ష కార్డుల పంపిణీ..

ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల పిల్లల ఆరోగ్యంపై కలెక్టర్‌ దృష్టి సారించారు. ఇందుకోసం రాష్ట్రంలోనే తొలిసారిగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 75 సంక్షేమ గురుకుల పాఠశాలలు, 545 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మల్లంపల్లి కేజీబీవీలో విద్యార్థినులకు కిశోర్‌రక్ష కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలకు వైద్యశిబిరం నిర్వహించి కార్డులపై పరీక్షల ఫలితాలను నమోదు చేయించారు. దశలవారీగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు చేయించి కిశోర్‌రక్ష కార్డులు అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్‌గౌడ్‌, వైద్యాధికారి కిరణ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

మల్లంపల్లి కేజీబీవీ ప్రత్యేక అధికారిపై కలెక్టర్‌ సత్యశారద ఆగ్రహం

వంట మనుషులను వెంటనే

తొలగించాలని ఆదేశం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

న్యూశాయంపేట: పథకాలు అందించడమే కాకుండా వాటిద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో పలుశాఖల అధికారులతో కలెక్టర్‌ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పథకాల పర్యవేక్షణపై ఆయా ప్రాజెక్టుల అధికారులు దృష్టి సారించాలన్నారు. మహిళలు, పిల్లల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పలు ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించి సమర్థ నిర్వహణకు సూచనలు చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్‌, డీఐఓ శ్రీధర్‌ సుమన్‌, సీడీపీఓలు మధురిమ, విద్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement