
బోనమెత్తిన కవిత
నర్సంపేట: జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోచమ్మ బోనమెత్తారు. చెన్నారావుపేట మండలంలోని పాత మగ్ధుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి మెమోరియట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన ఫౌండేషన్ చైర్మన్ వేములపల్లి రాజు నూతనంగా నిర్మించిన పోచమ్మగుడి ఆలయ ప్రాంగణాన్ని ఆదివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా కవిత బోనం ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేములపల్లి రాజు తన తండ్రి మొగిలి జాపకార్ధంగా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. మాజీ ఉపసర్పంచ్ ననుమాస కరుణాకర్, తూటి శ్రీనివాస్, వరంగంటి సంతోష్, చెవ్వ రాజేంద్రప్రసాద్, దొంతి సంతోష్, సంకటి రాజేంద్రప్రసాద్, పిట్టల కుమారస్వామి, నాంపల్లి సంతోష్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక మహిళలతో కవిత కలిసి కోలాటమాడారు.
రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేదు
రైతులకు ఎరువులను అందించడంలో సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెన్నారావుపేట మండలంలోని పాతమగ్ధుంపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లోని రైతులకు సరిపడా ఎరువులను అందించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా కేసీఆర్ చూశారన్నారు. ఎరువుల కోసంగోదాముల ముందు రైతులు బారులుదీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుడే మంచిగుండె..
గీసుకొండ: మండలంలోని మచ్చాపూర్ సమీపంలో వరంగల్–నర్సంపేట రహదారి పక్కనే పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళలను కల్వకుంట్ల కవిత పలకరించారు. అంతా మంచేకదా.. బాగున్నారా.. అంటూ వారితో మాట్లాడారు. దీంతో మహిళలు బతుకమ్మ పండుగకు తండాకు రావాలె అంటూ కవితను ఆహ్వానించారు. బతుకమ్మ చీరల ఇస్తున్నారా.. అని అడగడంతో.. ఇస్తలేరు.. ఏం లేదు అని చెప్పారు. ఫింఛన్లు ఇస్తున్నరా.. అని కవిత అడగ్గా.. తన భర్త చనిపోయి ఏడాదిన్నర అవుతోందని, ఫించన్ రావడం లేదని ఓ మహిళ వాపోయింది. మహిళలకు రూ.2,500 ఇస్తున్నారా.. అని కవిత అడిగారు. బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నారు కానీ, రోజు కూలి చేసుకునే మేము ఎక్కడకు పోతాము అంటూ మహిళలు చెప్పారు. అప్పులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం చెబుతోందని మహిళలు అనడంతో ఏయ్ మీరు సీఎం రేవంత్‌రెడ్డి లెక్క మాట్లాడొద్దు అంటూ కవిత చమత్కరించారు. ‘అప్పుడే మంచిగ ఉన్నది. ఆయన(కేసీఆర్) టైం ప్రకారం డబ్బులు వేసేది’. అని మహిళలు చెప్పడంతో కవిత నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
పాత మగ్ధుంపురంలో పోచమ్మగుడి ఆలయ ప్రాంగణ ప్రారంభోత్సవం
పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కవిత

బోనమెత్తిన కవిత