
రైతుకు విశిష్ట సంఖ్య
నెక్కొండ: వ్యవసాయరంగాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూమి ఉన్న ప్రతి రైతుకూ ఇకపై ప్రత్యేక విశిష్ట సంఖ్యను కేటాయించనుంది. భారతీయులందరికీ 12 అంకెలతో ఇచ్చిన ఆధార్‌కార్డుల మాదిరిగా ఇప్పుడు రైతులకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యూనిక్ కోడ్) రానుంది. తాజాగా ఈ ఆదేశాల్చిన కేంద్రం.. తక్షణమే అమలు చేయాలని సూచించింది. దీంతో జిల్లాలోని వ్యవసాయశాఖ సిబ్బంది తమ క్లస్టర్ల పరిధిలో నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎందుకంటే..
పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన, ధ్రువీకరణ, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని భూములు, పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంట వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదు. వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది. వీటన్నింటికి పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 19 రాష్ట్రాల్లో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఐదో తేదీ నుంచి ‘అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని సూచించింది.
అనుసంధానం ఇలా..
మొదట వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) అవకాశం కల్పించింది. త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. శిక్షణ పొందిన మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో అనుసంధాన ప్రక్రియ మొదలైంది. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు రెవెన్యూ శాఖ ద్వారా భూ యాజమాన్య హక్కు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు ప్రస్తుత ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్‌తో ఎంఏఓ, ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుడికి (రైతు) ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట సంఖ్య కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని పథకాలకు సంబంధం లేదు..
రైతుల విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు, రాష్ట్రంలో చట్టబద్ధ భూ యాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయ శాఖ పేర్కొంది.
నిర్దేశించిన తేదీల్లో
ఏఈఓలను సంప్రదించాలి
రైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియ జిల్లాలోని అన్ని క్లస్టర్ల పరిధిలో కొనసాగుతోంది. జిల్లాలో 53 మంది ఏఈఓలకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏ గ్రామంలో ఎక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారో ముందే తెలియజేస్తాం. అక్కడికి రైతులు తమ ఆధార్‌కార్డుతో సహా సంబంధిత పట్టాపాసు పుస్తకాలను వెంట తీసుకెళ్లాలి. ఫోన్ నంబర్ చెప్పి ఏఈఓల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంఖ్య ఉంటేనే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వర్తిస్తుంది.
– అనురాధ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లా వివరాలు..
11 నంబర్లతో యూనిక్ కోడ్ కేటాయింపు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో
స్పెషల్ డ్రైవ్
గ్రామాల్లో ప్రారంభమైన
అనుసంధాన ప్రక్రియ
వ్యవసాయ డివిజన్లు : నర్సంపేట, వర్ధన్నపేట
క్లస్టర్ల సంఖ్య : 53
జిల్లాలో సాగుభూమి
విస్తీర్ణం : 2. 60 లక్షల ఎకరాలు
రైతుల సంఖ్య : 1.56 లక్షలు