
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, గన్నీ సంచుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. జిల్లాలో గన్నీ సంచుల కొరత లేదని, రైతులకు ఎప్పటికప్పుడు అందజేయాలని నిర్వాహకులను ఆదేశించారు. పాడీ క్లీనర్లతో ధాన్యాన్ని శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 180 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 40 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీఎస్‌ఓ కిష్టయ్య, సీఈఓ ఆంజనేయులు, డీటీలు రాజారేణుక, సంధ్యారాణి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
సన్న వడ్లకు రూ. 500 బోనస్
నెక్కొండ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లకు రూ.500 బోనస్ అందిస్తోందని జిల్లా వ్యవసాయ శాఖ, మండల ప్రత్యేక అధికారి అనురాధ అన్నారు. నెక్కొండలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. ఏ–గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, బీ–గ్రేడ్‌కు రూ. 2,300 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని, ధాన్యం తడవకుండా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. అలాగే, బొల్లికొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను డీఏఓ పరిశీలించారు. నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఏఓ నాగరాజు, ఏఈఓలు అరుణ్, వసంత, గ్రామ కార్యదర్శులు బాలకృష్ణ, పెంటయ్య, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి