ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర! | Sakshi
Sakshi News home page

ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర!

Published Wed, Nov 29 2023 1:22 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఈనెల 15న ముగియగా.. సుమారు 13 రోజులపాటు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగించారు. నేతలు చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరలేపి, ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి 12 నియోజకవర్గాల నుంచి 36 మంది పోటీలో ఉన్నా రు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ సాగుతుండగా.. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు, శ్రేణులు రంగంలోకి దిగగా.. మరోవైపు ఎలాగైనా సత్తా చాటాలని స్వతంత్రులు పావులు కదుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో నేతలు, అభ్యర్థులు తమ చివరి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరిరోజున ఉమ్మడి జిల్లాలో సభలు, సమావేశాలు, బైక్‌ ర్యాలీలు, కులసంఘాల భేటీలతో పట్టభద్ర ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా పోలింగ్‌ చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు.

ఓరుగల్లు ప్రచారంలో అగ్రనేతలు..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్‌ 16న ఉమ్మడి వరంగల్‌లో తొలి ప్రచార సభను జనగామలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ అప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్టోబర్‌ 18న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, కేంద్రమంత్రులు అమిత్‌షా, అనురాగ్‌ ఠాకూర్‌, అశ్వినికుమార్‌ చౌబే తదితరులు ఉమ్మడి వరంగల్‌లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా పార్టీల తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం సీఎం కేసీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో తిరగ్గా.. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు క్యాంపెయిన్‌ నిర్వహించారు. ధర్మసాగర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో డీకే శివకుమార్‌, రేవంత్‌రెడ్డి, విజయశాంతి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్‌పీ పక్షాన ఆ పార్టీ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతుగా ప్రచారసభల్లో పాల్గొన్నారు. మొత్తంగా 13 రోజుల పాటు పోటాపోటీగా సాగిన ప్రచారం, డీజేలు, మైకుల మోత మంగళవారం సాయంత్రం నిలిచింది.

ఎవరి వ్యూహాలు వారివే..

ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా వరంగల్‌ తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా భూపాలపల్లి నుంచి 9 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 29,74,631 ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజుకోరీతిలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ప్రచారం పోరు రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు ప్రచార ఆర్భాటానికి మంగళవారం సాయంత్రం తెరపడడంతో రాత్రి నుంచి డబ్బులు, మద్యం, కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కాగా.. నగదు, మద్యం భారీగా పంపిణీ జరుగుతుందన్న ప్రచారం మేరకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 24 చెక్‌పోస్టుల ద్వారా సుమారు రూ.12 కోట్ల మేరకు నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు.

అగ్రనేతల ప్రచారంతో హోరెత్తిన ఓరుగల్లు

నేతల మాటల తూటాలతో

ఎన్నికల పోరు రసవత్తరం

ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు

షురూ అయిన డబ్బు, మద్యం పంపిణీ

ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు?

x
1/2

x

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement