హన్మకొండ అర్బన్: తెలంగాణ సహా దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించి శాసన సభ సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మూడేళ్లకు మించి అధికారులు విధుల్లో ఉండవద్దని, రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాలని, కేసులు నమోదైన వారు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలో ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులను, రెవెన్యూ అధికారులను సొంత జిల్లాల్లో ఉంచవద్దని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బదిలీల జాబితా సిద్ధం చేసినా 22న ఉత్సవాలు ముగిసిన తరువాత రిలీవ్ చేసే అవకాశం ఉంది.
కలెక్టర్ మినహా అధికారులందరూ బదిలీ?
హనుమకొండ జిల్లాలో కలెక్టర్ మినహా అధికారులందరూ దాదాపు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నా యి. ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులవి కూడా భారీగా బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. ఇక తహసీల్దార్లు పూర్తిగా జి ల్లా వదలాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నికలు ము గియగానే కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ఎక్కడివారు అక్కడికే అన్నట్లు వచ్చేవారు. ప్రస్తుతం శాసనసభ అనంతరం లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో బదిలీ అయిన వారు కనీసం సంవత్సరంపాటు ఇతర జిల్లాలో చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. మొత్తానికి జిల్లాల విభజన, జోనల్ వ్యవస్థ, 317జీఓలతో బదిలీలు అంటేనే హడలిపోతున్న ఉద్యోగులకు ఎన్నికల పేరుతో మరోసారి బదిలీ కుదుపునకు గురవుతున్నారు.
జిల్లాలో భారీగా అధికారుల
బదిలీలుండే అవకాశం
నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి


