
సాధించిన పతకాలతో జిల్లా హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు
కాశిబుగ్గ: హైదరాబాద్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో వరంగల్ జిల్లా క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. గత నెల 28 నుంచి 31 వరకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా నుంచి 215 మంది క్రీడాకారులు పలు క్రీడల్లో పోటీపడ్డారు. వారిలో జిమ్నాస్టిక్ పురుషుల విభాగంలో సూర్యదేవ్ (రోమన్‌రింగ్స్)లో బంగారు పతకం, ఫ్లోర్‌లో కాంస్య పతకం సాధించారు. మహిళల విభాగంలో ఎ.అనూష కాంస్య పతకం సాధించింది. అర్చరీ పురుషుల విభాగంలో గంగ రాజు వెండి, మహిళల విభాగంలో ఎస్.నవ్య కాంస్య పతకాలు సాధించారు. హ్యాండ్‌బాల్ పురుషులు, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించాయి. బ్యాడ్మింటన్ మహిళా విభాగం డబుల్స్‌లో బి.పూజ, శుకృతి వెండి, మిక్స్‌డ్ డబుల్స్‌లో రితిన్, బి.పూజ వెండి, రితిన్(సింగిల్స్‌లో) కాంస్య పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో కె.అభిరామ్ కాంస్య పతకం సాధించినట్లు జిల్లా క్రీడల అధికారి ఎస్.ఇందిర తెలిపారు. మొత్తం గోల్డ్–1, వెండి–3, కాంస్య–7 పతకాలు జిల్లాకు వచ్చాయని ఆమె తెలిపారు. ఈసందర్భంగా ఆమె కోచ్‌లు, క్రీడాకారులను అభినందించారు.