హరియాణలో పాడి రైతుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

హరియాణలో పాడి రైతుల అవస్థలు

Mar 30 2023 1:46 AM | Updated on Mar 30 2023 1:46 AM

హరియాణలో డెయిరీ ఫాం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న దళిత పాడి రైతులు  - Sakshi

హరియాణలో డెయిరీ ఫాం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న దళిత పాడి రైతులు

నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పాడి గేదెల కొనుగోలుకు అవకాశం కల్పించినా.. అధికారుల కక్కుర్తితో దళిత రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు చెందిన రైతులు హరియాణలో ఐదురోజు లు గా ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ ఆందోళనకు దిగారు.వరంగల్‌ జిల్లా నల్లబెల్లి, నెక్కొండతోపాటు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలాలకు చెందిన 50 మంది దళిత రైతులకు ఎస్సీ కార్పొరేషన్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ పథకం ద్వారా రూ.4లక్షల విలువ చేసే నాలుగు గేదెలను ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతగా హరియాణలో నచ్చిన చోట కొనుగోలు చేసుకోవా లని అధికారులు.. రైతులను ఈనెల 26న నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కించారు. మీరు వెళ్లాక మేము వస్తామని, మీరు వెళ్లాలని సూచించడంతో అధికారుల మాటలు విని రైతులు వెళ్లిపోయారు. హరియాణలోని రోహతక్‌ జిల్లాలో పాడి గేదెలను సరఫరా చేసే కురాణ డెయిరీ ఫాంనకు చేరుకున్నారు. నచ్చిన గేదెలను చూసుకొని కొనుగోలుకు సిద్ధమయ్యారు. కానీ.. ఇక్కడే అసలు కథ మొదలైంది. తీరా కొనుగోలు చేసే సమయానికి అధికారులు సంబంధిత రైతులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. తాము వచ్చిన చోటకు వచ్చి గేదెలను కొనుగోలు చేసుకోవాలని, లేదంటే పథకాన్ని రద్దు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.

ఐదు రోజులుగా భోజనం బంద్‌

గేదెల కొనుగోళ్లకు వెళ్లిన రైతులకు ఐదు రోజులుగా స్నానాలతోపాటు భోజనం అందని పరిస్థితి నెలకొంది. వెంట తీసుకెళ్లిన డబ్బులు కూడా ఖర్చు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. నచ్చిన గేదెలు కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికి కమీషన్‌ల కోసం కక్కుర్తిపడిన అధికారుల తీరు పాడి రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలో అర్థంకాక హరియాణలోని కురాణ డైయిరీ ఎదుట గత 24 గంటల నుంచి ధర్నాకు దిగారు. అధికారులకు ఫోన్లు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని దళిత పాడి రైతులు మాదాసి సురేష్‌, వేల్పుగొండ నర్సయ్య, పరికి కోర్నేలు, గంగారపు లింగయ్య, మందపెల్లి శ్రీని వాస్‌, కోడూరి ప్రవీణ్‌, స్వామి, మైబు, నర్సయ్య, మల్లేశం, సాంబయ్య, కుమారస్వామి, రాజు వాపోయారు.

సహాయం కోసం ఎదురుచూపులు

పాడి రైతులు అధికారుల తీరుతో నానా తంటాలు పడుతున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా అధికారులు మాత్రం రైతుల వద్దకు వెళ్లకపోవడంతో పాడి రైతులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడిన అధికారులపై చర్యలు తీసుకొని, నచ్చిన గేదెలను కొనుగోలు చేయించి తమను గమ్యస్థానాలకు చేర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయం చేయాలని కోరుతున్నారు.

ఐదు రోజులుగా ఆహారం బంద్‌

గత 24 గంటల నుంచి

కొనసాగుతున్న ధర్నా

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement