వనపర్తి: భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని.. వాటి శాశ్వత పరిష్కారం కోర్టుల్లోనే సాధ్యమని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, ధౌర్జన్యాలు, మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మొత్తం 25 వినతులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.


